అమ్మా భవానీ
కాస్త విను మా ఈ చిన్న విన్నపాన్నీ
ఇలా అడిగానని మరోలా అనుకోమాకు
అయ్యవారిని ఈ నెలకు వదిలేయి మాకు
ఏ విషాలను గొంతున మింగనీక
మాతో పాటు పస్తులుంచుతాం
ఏదో మిషతో స్మశానాలపడి తిరుగాడనీక
జాగారాలు చేసి రాతిరంతా కాపు కాస్తాం
బూడిద పూతలు ఒంటి నిండా పూసుకోనీక
పాలు కుమ్మరించి స్నానాలాడిస్తాం
యోగనిద్ర పేరున నిద్రలోకి జారిపోనీక
ఊళ్ళూ గుళ్ళూ తిప్పి వ్యాయామాలు చేయిస్తాం
ఆయనని వదిలి ఉండలేననే బెంగ సాకుతో
మమ్మల్ని చూడాలని నువ్వూ రోజూ వస్తావులే
పూలూ, పళ్ళూ కుంకుమలూ సిద్దం చేస్తాం
వాటితో కలిపి నీ సామిని నీకే అప్పగించేస్తాం
అయినా
కైవల్యాలు కైలాసాలూ కావాలా మా కేమైనా
కేవలం క్షేమస్థైర్యవీర్యవిజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాదులేగా మేం కోరేదీ
భోళా శంకరుడు ఎలాగూ ఇస్తాడడగకపోయినా
ఆయనకన్నా నువ్వేం తక్కువా
మరి నాలుగు కలిపి ఇచ్చేస్తావు నీ తధాస్తు దీవెనా

Leave a Reply