చూసుకుంటూ, అడుగేసుకుంటూ
రావయ్యా, నల్లనయ్యా
తెల్లని ముగ్గుల తో అడుగులు దిద్దుకున్నా
నీ పాదాల నలుపు తాకి నల్లబడిపోతాయేమో
తొక్కకుండా చూసుకుంటూ అడుగేసుకుంటూ రా
అమ్మ యశోద చెవి నులిమేనని బెదురుతూ
పరుగులెడుతూ నా ముగ్గుల చెదరకొడతావేమో
నెమ్మదిగా చూసుకుంటూ అడుగేసుకుంటూ రా
ఏ మడుగుల అడుగున దాగిన విషనాగుల పడగల ఆడి ఆడి వస్తున్నావో
బురదలతో నా ముంగిటి అడుగుల మరక సేయక
చూసుకుంటూ, అడుగేసుకుంటూ రా
అలాగన్నానని అలిగి ఆగిపోక అలాగే వచ్చేయ్
నీకై నే వేసిన అడుగులలో
నాకై నీ అడుగులేసుకుంటూ
నీవెలా వస్తేనేం వచ్చేయ్
నీ గురుతులు నాకెలా ఇస్తేనేం ఇచ్చేయ్
పదములె చాలు కృష్ణా నీ పద ధూళులే పదివేలూ
పదములె చాలు కృష్ణా నీ పద ధూళులే పదిలాలు
+1
+1
+1
+1

Leave a Reply