వీధికి చిరునామాలా పోస్టు బాక్సు సందు చివర్ని
సందంతా సందడి చేస్తూ సందిట్లో పెంకుల గిర్ని
పలకరిస్తూండేవి దారంట వచ్చేపోయే జనులందర్ని
అదిగో అక్కడే ఉండేది నేను పుట్టి పెరిగినిల్లు
లంకంత ఇల్లుని తలచుకుంటే ఎంతో త్రిల్లు
నను నడిపిస్తూ నాకు నీడనిస్తూ
నను నవ్విస్తూ నాకు దీవెనలనిస్తూ
నను పలకరిస్తూ తొలిపలుకులు నాకు నేర్పిస్తూ
పెరటిలో నిలుచునుండేవి అవిగో నలుమూలలా
బాదం, జామ, ఉసిరి, కొబ్బరి చెట్లేమో అనుకునేలా
కోతిమూకలు నాలుగు స్తంభాలాటలాడుకునేలా
మట్టినేలలు, మేడ మెట్టులు,
పిట్టగోడలు,పొగ్గూడులు
ఐస్ బాయిస్ ఆటల్లో మము దాచే
తులసి కోట, పూలతోట
కావేవీ మా అల్లరులకి అనర్హం
రావేవీ ఆ రోజులకి సమతుల్యం
ఇంటి బయటకి వస్తే పక్కనే రాములు దుకనం
ఏదో కొంటూ పొద్దూకులూ కనిపించే బస్తీజనం
చుట్టుపక్కల ఎస్సార్టీ క్వార్టర్ సూ
కాస్త అడుగేస్తే బాలాజీ టాకీసూ
పాన్ లే పాన్ అంటూ వినిపించే సాహెబు కేకలు
అల్లం మురబ్బా అంటూ కనిపించే తోపుడు బళ్ళూ
నెత్తిన బుట్టేసుకుని నెలకో సారి వచ్చే
స్టీలు సామానులమ్మే అమ్మిని
మూటెడు బట్టలు ముందేసి
అమ్మ అడిగేది గంగాళం ఇమ్మని
బట్టలని బంగారం నాణ్యతలా పరీక్ష చేసి
అమ్మి చెప్పేది వాటికి చెంచాతో సరిపెట్టుకొమ్మని
అమ్మ గంగాళానికి అమ్మి చెంచాకి
ఓ గంట బేరాల కుస్తీ జరిగేది
ఇద్దరూ తామే గెలిచామనే ఫీలింగుతో
చివరికి ఓ స్టీలు గిన్నెతో రాజీ కుదిరేది
ఎంత బాగుండేదో ఆ సీను చూపరులకి
అవగతం కాదది కనులారా చూడని పరులకి
ఆజా బచ్ పన్ ఏక్ బార్ ఫిర్
అనే ధైర్యం నేను చేయలేను కానీ
ఆ మధుర స్మృతుల ముసాఫిర్
అలా జీవితాంతం నాతోనే ఉండిపోనీ

Leave a Reply