సమ్మతమేనా సీతమ్మా …

సమ్మతమేనా సీతమ్మా …

వరమాల వేసేందుకు రాముని వైపుగా కదులుతోంది సీత
ఉరవడి మనసు అడుగులనడుగుతోంది
వడివడిగా అడుగేయమని
సిగ్గుల దొంతర వెనుకకు లాగుతోంది
ఆ తొందరలెందుకని

అలా కదిలీ కదలని అడుగుల నడిచే జానకిని
భూమాత అడిగిందట ఒక్క క్షణం ఆగమని

సమ్మతమేనా సీతమ్మా
ఈ రామయ్యతో మనువు
నీ అభిమతమేమో చెప్పమ్మా

ఎక్కుపెట్టబోయిన విల్లు విరిచిన వైనం చూశావుగా
సుకుమారమైన నీ దేహానికి ఏమైనా సందేహమేమో

పెద్దలమాటే శిరోధార్యమట
ఆ తలపై ఎక్కి ఊరేగేందుకు నీకు చోటుందా?

చిరునవ్వెపుడు ఆ పెదవుల వీడదు
ఆ నగుమోము నీకు ఘడియైనా సొంతమౌతుందా ?

ఒక చేత ధనువు మరో చేత ధర్మం
ఎప్పుడూ పట్టుకునే ఉంటాడు
నీకు ఆ వేలు పట్టుకు తిరిగే వీలుంటుందా ?

ఏ కొంత మేలు చేసినా సోదరా అంటూ ఆలింగనాలే
ఏకాంతంగా ఆ హృది నీ కౌగిలింతకందుతుందా?

ఏ రామబంటో సదా ఆ పాదాలంటే ఉంటాడేమో
కనీసం పాదాలొత్తే సేవాభాగ్యమైనా నీకు దక్కేనా

సమ్మతమేనా సీతమ్మా
ఈ రామయ్యతో మనువు
నీ అభిమతమేమో చెప్పమ్మా

లోకమాత సీతమ్మకి తెలియంది కాదు
బిడ్డ సుఖ సంతోషాలకై తల్లడిల్లే తల్లి మనోగతం

అందుకే అలా అడుగుతున్న తల్లికి ప్రణమిల్లి
చిరునవ్వే సమాధానంగా తెలిపింది తన అభిమతం

విషయం భోదపడింది భూదేవికి
సీతారాములు వేరు కారు శ్రీకర అవతారులనీ
వారి కలయికలు ఎడబాటులు
దుష్టుల బారినుండి తన భారం తగ్గించే లీలలనీ

ఆనందంగా చేతులెత్తింది శుభమస్తు అని దీవిద్దామని
ఆ చేతులవే ముకుళితమయ్యాయి తననే దీవించమని
+1
1
+1
0
+1
0
+1
0

Comments

2 responses to “సమ్మతమేనా సీతమ్మా …”

  1. Anonymous

    చాలా బాగుంది

  2. Anonymous

    Chala bagundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).