ఇక్కడ నీ ఒకప్పటి నేస్తాన్ని నేనొంటరినైపోతున్నాను
ఇంకెన్నాళ్ళులే ఇక ఇపుడో ఎపుడో నేల రాలిపోతాను
పోయాక నువు కార్చే కన్నీరు ఆగిన గుండెకి ఊరటనిస్తుందా
ఇపుడే ఒకసారి కలవరాదా, కలిసి నిండుగా నవ్వించరాదా
నాతో కన్నీరు కార్చరాదా, ఓదార్చరాదా పోనీ కవ్వించరాదా
కాటికి సాగనంప రావడం వృధా ప్రయాస కాదా
నే ఉండగానే నా ఇంటివైపు ఓ అడుగేయరాదా
ఎలా ఉన్నావూ అని ఓమారు అడిగేయరాదా
నాతో ఏ చేదు అనుభవమో నా కడదాకా నీతోటే ఉంటుందా
నా కట్టెతోనే అది మసియై సమసిపోతుందా
బ్రతికుండగానే నా తప్పు క్షమించి ఆ మరకలు తుడిచేయరాదా
కీర్తిశేషుడనని కీర్తిస్తే ఆ పొగడ్త నా చెవులకి వినిపిస్తుందా
ఉన్నప్పుడే మన చిన్ననాటి ముచ్చటల మూటలు విప్పరాదా
ఆ నాలుగు ముక్కలూ నాతో ఇపుడే ముచ్చటగా చెప్పరాదా
పూలదండ వేస్తే నా శవం చూస్తుందా, లేచి గంతులేస్తుందా
నీ ఊహలో నను ఇపుడే తలవరాదా, హలో అని పిలువరాదా
కలిసేయి నేస్తమా చక్కటి టీ కో, మరోటికో
ఆ మంచి తరుణం దొరికేది మళ్ళీ ఏ నాటికో

Leave a Reply