ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
నా నుంచి నీకు ఇంతకన్నా ఇంకేం కావాలే
బాల ప్రాయంలో నా తోటి నేస్తాలుగా చేరి
ఎప్పుడూ నాతోటే ఆడుకున్నావ్, నీకింకెవరూ తోడు లేకనో ఏమో
గాయత్రివై వేదాలు పలుకుతూ, గీర్వాణివై వీణలు మీటుతూ
పరీక్షలకు నే చదువుకునే వేళ నా నిదుర చెదరగొట్టావ్
నా మానాన నేనేదో వ్రాతలు వ్రాసుకుందామంటే
నీ లలిత లలిత పద కలిత కవితలెద పలికించావ్
నే స్వంతంగా ఆలోచించలేననుకున్నావేమో
నాలుగు ముద్దలు తిని బొజ్జ నింపుకు పరుగెడదామంటే
పూర్ణాన్నప్రదాత మాతవై పళ్ళెం నింపావ్, తినడమే నా పనైనట్టు
చుట్టాల రూపంలో నా చుట్టూ దుర్గమై నిలిచి
విజయబాటలో నడిపించావ్, నాఅంతట నేగెలవలేనట్టు
ఆప్యాయానురాగాల బంధాలని కుటుంబంగా నాకందించి
ఆనందసాగర కేళిలో ముంచుతున్నావ్,
పన్నీటి కెరటాలపై భద్రంగా కాళివై తేలుస్తున్నావ్
ఆప్తులని, సజనులని దరిచేర్చావని మురిసి
పండగ పూటా ఏదో దీపాలూ ఆరతులూ ఇచ్చి నిను మురిపిద్దామనుకుంటే…
కోటిసూర్యప్రభాకాంతులతో లక్ష్మీప్రసన్నవై నిలిచావ్ నా దీపాలు వెలవెలబోయేలా
ఇవేవీ చాలనట్టు
నీ రాజరాజ్యైశ్వర్యాలకు నీరాజనాలర్పిస్తూ
నిను సదా ధ్యానించుకునే భాగ్యమిచ్చావ్
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
నీ నుంచి నాకు ఇంతకన్నా ఇంకేం కావాలే

Leave a Reply