ఆడుకో కృష్ణా నీవాడుకో చాలు
ఈల పాటలు పాడుకుంటూ ఇలపై తిరుగాడుకో చాలు
వేడుకగా మేం చూస్తూ ఉంటాం నువు పాడుతూ ఆడుకో చాలు
ఏదో మిషతో అడుగులు వేసే నీ పదములె చాలు
తెలుసులే మడుగుల దాగిన విష సర్ప పడగలపై ఆడడాలు
వైరస్సుల విష శిరస్సులపై అవి ఆనితే అదే పదివేలు
అల్లరి చేసి అమ్మకి చిక్కి రోటికి నిన్ను కట్టించుకో చాలు
ఎరుకేలే మహావృక్షాలు నేలరాలేలా రోలీడ్చడాలు
నీ వెంట కదిలే ఆ రోళ్ళే పెకిలించునులే మహమ్మారి కూకటి వేళ్ళు
అన్న చూడని వేళ మన్ను కరకర నమిలేయి చాలు
శిశువో వెఱ్ఱివో ఆకొంటివో అనుకొంటేనేం ఆపకు తినడాలు
మన్ను కొరికే పన్నుల నడుమ నలుగులే కరకు కరోనా కోరల అహంకారాలు
కంసుడంటి కోవిడు తోబుట్టువుకే పుట్టి మట్టి కరిపిస్తావో
వటువై అడుగెట్టి నరబలి హీనుని
బలహీనుని జేసి పాతాళానికి తొక్కేస్తావో
ఏ రూపంలో జరుగుతుందో నీ పునరాగమనం
ఆడడాలు, పాడడాలు ఏం చేసినా నిన్నాగమనం
భాగవతం నువు చదివావో లేదో నీ మహిమలు మాకెరుకేలే
నువు చేసే ఆటపాటల లీలలన్నీ ఎల్లవేళలా మాకొరకేలే
నీలాకృష్ణా నువు నీలా ఆడుకో పాడుకో
ఆడేవాడివో పాడే వాడివో కాపాడే వాడివో
అమాయకంగా నువు మా మధ్య నడయాడితే చాలు
ఖాయం పెనుమాయలన్నీ మటుమాయమై పోవడాలు
ఆడుకో కృష్ణా నువ్వాడుకో చాలు..

Leave a Reply