రుసలాడుతూ ముడిచి కూర్చున్నావు కోడలా
నీకు మూడేల మారిందె కోడలా
నీ ముఖమేల మాడిందె నేడిలా
ఆహుం ఆహుం…
ఇరుగుపొరుగు తోటి ముచ్చటలాడుతు అత్తమ్మా
నేను కొండనంటివేల అత్తమ్మా
రాతి బొమ్మనంటివేల చెప్పమ్మా
ఆహుం ఆహుం…
ఓహో అదా సంగతి
ఇరుగు పొరుగు మాట ఏ పొద్దు వినవద్దు కోడలా
మాయమాటలల్లి కొంప ముంచుతారె
వారు పచ్చగడ్డిలోన మంట రేపుతారె
మా ఇంటి కోడలు కొండెందుకన్నావు అత్తమ్మా..
నే కొండలా పడిఉండు దాననా
ఇంటి కోడలిగా నీకంటికాననా
నిను కొండన్న మాటే చెప్పారు కానీ కోడలా
బంగారు కొండన్న మాటదాచినారె
మా బంగారు కొండన్న మాటదాచినారె
కోడలు రాతీబొమ్మన్నారంట అత్తమ్మా
ఉలుకుపలుకు లేని దిమ్మనా
నే పలకలేని రాతి బొమ్మనా…
రాతి బొమ్మన్నదే చెప్పారు కానీ కోడలా
పాలరాతి బొమ్మ వన్న మాట దాచినారె
మా అందాల బొమ్మవన్న మాటదాచినారే
ఆహుం ఆహుం…
అది సరే కానీ
నాకు గీర అని ఊరంత కూస్తోంది కోడలా
అంత ఘోరమేమి నేను చేసినానే
గీర తోటి నేనేమి చేసినానే
అయ్యయ్యో
మీకు గీర అని నేనెపుడు అనలేదు అత్తమ్మా
ఇల్లు అత్త జాగీరన్నానే
మా ఇల్లు అత్త జాగీరన్నాలే
మరి
మా అత్త నసపిట్ట అన్నావంటా ఏలమ్మా
అంత నస నేనెపుడు పెట్టానే
నసలు నే నసలెపుడు చేశానే
ఓయమ్మో
నస కాదు నస కాదు నసపిట్ట అనలేదు అత్తమ్మా
పనస తొనలాటి తీపి మనసునీదమ్మా
ఆ మనసులోన నాకు చోటు ఉంచమ్మా
ఆహుం ఆహుం…
ఏమిటో అనుకున్నా గడుసు దానివే కోడలా
నీ మాట తీరుతోటి మనసు దోచినావె
ఆ మాట గోడ కట్టి ఇల్లు చేసినావె
మాటలిట్టే కట్టె గోడలా
మనసు నిట్టె పట్టె కోడలా
ఎంత మాటన్నారు మాతల్లో
మీముందు నేనెంత మాటల్లో
గడుసు కోడలా కట్టావె గోడలా
అమ్మ మాతల్లో నేనెంత మాటల్లో
ఆహుం ఆహుం ఆహుం


Leave a Reply