బావురుమన్న బీరువా

నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఇవాళే మొదటిసారి ఆయన bedroom లోకి వెళ్ళాను.
గదిలో ఆయన లేకపోవడంతో ఎంతో వెలితి.
కాస్సేపు అక్కడే నుంచుని వెనుదిరగబోయాను. అప్పుడు కనిపించింది. గోడకి చేరగిలబడి దిగాలుగా పిచ్చిచూపులు చూస్తూ, ఏమీ అర్ధం కాని అయోమయంలో స్థాణువులా..
పాపం బావురుమంటోంది నాన్నగారి బీరువా..
నిజానికి మా ఇంట్లో మా అందరికంటే ముందుగా 70 ఏళ్ళ క్రితమే అడుగెట్టింది ఆ బీరువా.
Master bedroom లో నేనే master ని అన్నంత ఠీవిగా నిలుచుని ఉండేది ఎప్పుడూ..
ఆయన జీవితానికి సాక్షి ఆ బీరువా.
పంచలైనా, పంచాంగాలైనా అందులోనే దాచేవారాయన.
బిల్లులైనా, పిప్పరమెంటు బిళ్ళలైనా అందులోనే.
పెన్నులైనా, గుండు పిన్నులైనా, నా 3rd class report అయినా అమ్మ medical reports అయినా
పర్సులు, డైరీలు, డబ్బాలు, డబ్బులు, రబ్బరు బాండులు, బాండు పేపర్లు అన్నీ అందులోనే
ఇంటి పెద్దతనం పెత్తనం అంతా ఆ బీరువానే చేసేది.
పిల్లలకైనా, పెద్దలకైనా ఏది ఇచ్చినా, ఇచ్చే చేయి ఆయనదే అయినా వచ్చేది ఆ బీరువా నుంచే. అందుకే దానికి ఎంతో గర్వం.
రోజులో సగం సేపు ఆయన్ని సగంపైగా తనలోనే దాచుకునేది.
కంచంలో అమ్మ అన్నం వడ్డించాకే బీరువాతో కబుర్లు ఆపి దాని తలుపు మూసి వచ్చేవారు.
ఎటైనా బయటకి వెళ్ళి వస్తే రాగానే చేసే మొదటి పని ఆ బీరువాతో కబుర్లే
ఆ బీరువా తాళం గుత్తి క్షణం కనబడకపోతే ఆ రోజంతా ఉపవాసమే..
ఏదో లెక్కతేలక ఆయన కోపంగా ఉన్నారని బీరువా తలుపు వేసే sound ని బట్టి తెలిసేది.
అదే ఆయన అండ. ఆయన గుండె. అదే ఆయన మనసు. అదే ఆయన ధ్యాస శ్వాస. అంతెందుకు అదే ఆయన.
అరగంట బయటకి వెళ్ళాలన్నా దానితో చెప్పందే కదిలేవారు కాదు.
అలాంటి ఆయన చివరికి తనతో చెప్పకుండానే ఎటో వెళ్ళిపోయారు
దిగులుగా ఢీలపడి నిల్చుండి పోయింది అంతటి బరువైన బీరువా గుండె బరువు చేసుకుంటూ..
బావురుమంటున్న బీరువాతో శృతి కలిపి వెనక్కి తిరిగాను ఓదార్చలేక, ఎలా ఓదార్చాలో తెలియక.

+1
0
+1
0
+1
0
+1
0

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This category

Other categories

ఇష్ట పది

నవ నవరత్నాలు

Latest (నవ) 9 (నవ) Kavithalu (రత్నాలు).