Attended a veda sabha today
ఏవో మాటలు వినిపించాయి లోనుండి మెల్లగా
ఇపుడే కాస్త సుషుప్తిలోకి నే జారుకుంటూండగా
ఆనందం కలిగిందా ఇవాళ నీకు…
అడుగుతున్నాడు ఆత్రంగా లోనుంచి జీవుడు
చిదానందరూపుణ్ణి కదా, కొత్తేముంది నాకు
నవ్వుతూ బదులిస్తున్నాడు ఇంకా లోనున్న దేవుడు
అదేంటి, ఈ రోజు వేద సభకి తీసుకెళ్ళాగా
పండితుల వేదపఠనం నీతో పాటు నేనూ విన్నాగా
ఇంతచేసినా నీకోసం అస్సలు నువు తృప్తి చెందవు
భక్త సులభుడవని పేరే కానీ నాకెప్పుడూ అందవు
విసుగ్గా వినిపించింది ఈసారి జీవుడి గొంతు
చిద్విలాసంగా నవ్వడం మళ్ళీ దేవుడి వంతు
వేదం వినే చెవులకు నా రూపం కనిపించిందా
సభను చూసే కళ్ళకి ఆ వేదం వినిపించిందా
ఇలా అయితేనే కదా సర్వేంద్రియాలు నాకైనట్టు
అలా జరిగిన తక్షణమే తెలుస్తుంది నీవే నేనైనట్టు
వివరం చెప్పి నవ్వుతోంది చిదానంద రూప శివోహం
అర్దం కాక నిద్రలోకి జారుకుంది ఎప్పటిలా నా అహం


Leave a Reply