చెప్పవయ్య హనుమ ఎవరు మాలో ధన్యులు
రామ కృపా పాత్రులలో ఎవరు అగ్రగణ్యులు
నేనా అన్నవి స్వామి పాదుకలు
ఏ పాద స్పర్శకై యోగిపుంగవులు చేస్తారో ధ్యానం
ఆ పాదాలను అంటిపెట్టుకొని ఉండడమెంతో ధన్యం
తనకు మారుగా రాజ్యమేలమని నాకిచ్చె అనుగ్రహం
అందుకే అడుగుతున్నా నాదేనా ఆ ధన్య భాగ్యం
నేనో అన్నది రామయ్య కోదండం
అందరికీ అభయమ్ము ఇచ్చు చేయి
సీతాసాధ్వి పాణిగ్రహణం చేసిన చేయి
దనుజుల త్రుంచుటలో నన్నేగా పట్టుకుంది
అంతకంటే మహాభాగ్యం ఇంకెవరికుంటుంది
నేనే అన్నది అయోధ్యా సింహాసనం
నన్ను తృణప్రాయంగా వదిలె ఆదర్శపురుషుడు
నాపై అధిష్టించినపుడు రామరాజ్య పాలకుడు
నా ప్రతిష్ట కోసం భార్యావియోగాన్ని భరించెనతడు
నాకంతటి భాగ్యమిచ్చె ఆ మహానుభావుడు
చెప్పవయ్య హనుమ ఎవరు మాలో ధన్యులు
రామ కృపా పాత్రులలో ఎవరు అగ్రగణ్యులు
విన్నాడు హనుమ చెవులు నిక్కబెట్టి
నేనా అన్న పాదుకలకి ప్రదక్షణ చుట్టి
నేనో అన్న కోదండానికో దండం పెట్టి
నేనే అన్న సింహాసనానికి హారతి పట్టి
నువ్వేమంటావు రామా అన్నాడు వినమ్రంగా తన గుండె తట్టి
సిగ్గుపడ్డాయవన్నీ అసలు ధన్యతేమిటో వివరంగా తెలియబట్టి
Explanation of the kavitha in the audio below


Leave a Reply