One the eve of Ayodhya temple launch
జగమే రామ మయం
ముందే చెబుతున్నా రామా
ఈ సారైనా అయోధ్యలో కుదురుగా కొలువుండిపో
కైకమ్మ కేకలు ధర్మసమ్మతాలే నంటూ
కాలి చెప్పులు వదలి కారడవులకి వెళ్ళిపోకు
నాటి భరతుడిలాటిది కాదు నేటి భారతం
కదన సింహాలమై నినుకాదన్నవారి భరతం పడతాం
నీ అయోధ్యాసింహాసనంపై నిను కూర్చోపెడతాం
మహమదీయులూ అసమదీయులే నంటూ
బాబరుల రుబాబులని భరించే శక్తి నీకుంది కానీ
నీవులేని అయోధ్యని సహించదు మా రామభక్తి
ఏమీ అనుకోకపోతే మరో మాట చెబుతా విను
ఏ తాగుబోతుల అభాండపు బూతులో విని
అడవులకి పంపించేయకు ఒంటరిగా సీతమ్మని
ఆ వియోగం, అభియోగం నీకెందుకు అనవసరంగా
దర్జాగా అమ్మతోడి రాజ్యమేలుకో నిరభ్యయరంతంగా
అప్పటి జనంలా కాదు మము వదలి తప్పుకోడానికి
సీతారామరహిత అయోధ్యని కిమ్మనక ఒప్పుకోడానికి
నవ్వే ఆ నగుమోము చూడచక్కగా బాగుంది కానీ
అదేమిటి అలా నవ్వుతున్నావ్ నా మాటలు విని
తానీషా నిషా దింపి భద్రంగా గుడిలో కూర్చోపెట్టినా
ఆ హనుమయ్య హృదయసీమ వదిలి నేను వస్తానా
భక్తజన భజనల్లో సదా కొలువుండే నన్ను
మందిరాల్లో బంధించడం ఏమిటని కదూ నీ నవ్వు
నీ దగ్గర దాపరికమెందుకు నిజం చెప్పేస్తా
రామజన్మభూమి మాత్రమే కాదు అయోధ్యానగరం
అది భారతీయ సనాతన జీవన సయోధ్యా శిఖరం
అందుకే కట్టుకున్నాం అక్కడ మరోసారి మందిరం
జగమే రామమయం
రామ నామమే జయం జయం


Leave a Reply