For my father’s birthday. In his fond memory…
అమ్మ ఉండే ఊరెళ్ళాలి నను త్వరగా రైలెక్కించరా
అదిగో నా సామానులమూట రైల్లో నా పక్కే ఉంచరా
ఎన్ని సార్లు చెప్పారో నాన్నగారు ఆ మాట
పదేపదే చూపిస్తూ తన సామానుల మూట
రైలు బయలుదేరడానికి ఇంకాస్త టైముంది ఆగండి
మీతోటే భద్రంగా ఎక్కిస్తా మీ మూట ఎటూ పోదండి
నచ్చచెప్పి నవ్వేవాణ్ణి మూట ఆయన దగ్గరకి చేరుస్తూ
ఆత్రంగా చూసుకునేవారు మూటవిప్పి మళ్ళీ బిగిస్తూ
ఇంకా రైలు బయలుదేరదేం అడిగేవారు గంటకోసారి
ఆయనే గార్డై పచ్చజండా ఊపేశారిక విసిగి వేసారి
ఆయన ఎక్కిన రైలు కదిలి వెళ్ళిపోయింది
హడావిడిలో మూట ఇక్కడే ఉండిపోయింది
అంతచెప్పినా మూట ఎక్కించలేదని నను నేనే తిట్టుకుంటూ విప్పి చూసి
కావాలనే ఆయన వదిలేశారని తెలిసి దండం పెడుతూ చూశా రైలుకేసి
కాదది నిజానికి ఆయన సామానుల మూట
మా కోసం దాచుంచిన మంచి ఙ్ఞాపకాల ఊట


Leave a Reply