ఎందుకయ్యా కాళ్ళు నొప్పెట్టేలా అలా నిలిచే ఉంటావు గోవిందా
నీవు శిలవు సరే నీకు నొప్పుండదు కనీసం ఆ పాదాలపై నీకు దయ ఉందా
ఏమి నేరములు చేసినాయనీ అంత కినుకరా పదములపై
గోవిందా నీకు అసలు దయ ఉందా
గోవిందా పదముల నొప్పులు నీకోవిందా
చేపపిల్లవై ఈదులాడగా నీ తోడురాక
నిను ఒంటరి చేపగ పంపించెననా
ప్రేమతొ శ్రీసతి పిసికెడి రెండు పాదములు
కూర్మ వరాహ మూర్తుల నాలుగై పని పెంచెననా
ఎందుకు సామీ వాటిపై నీకంత కోపం
అలా నిలబెట్టేశావు ఏం చేశాయో పాపం
ఉగ్ర నృసింహుడవై నువు నిలుచుంటే
నిను ఆహ్లాద పరచే ప్రహ్లాదునికి సహకరించెననా
ఆతని మనుమని పాతాళమంపగా
త్రివిక్రమ పాదమై తల ఒంపించెననా
గొడ్డలి నరికి కారిన రక్తపు మడుగుల బ్రహ్మ కడిగిన పాదములడుగులు వేసెననా
ఎన్నాళ్ళని ఆ పదములు నొవ్వగ నిలిచివుందువో గోవిందా
ఎంత నిలిచినా ఏమి నొచ్చినా నీ పదములపై దయ నీకుందా
రాతిని నాతిగ మార్చునప్పుడు పరస్త్రీ అహల్యను తాకెననా
బుడిబుడి అడుగులు వేసే వయసున
విషనాగు పడగల చిందులేసెననా
ఆపద మొక్కుల శ్రీనివాసుడవే
ఆ పదములనొప్పలనెరుగకుంటివా
సేద తీరాలని వాటికి ఉందేమో
ఎన్నడైనా వాటి గోడు వినిపించుకుంటివా
ఇంత అడిగినా చెప్పవేం అసలు సంగతి ఇదీ అని
తెలిసిందిలే ఇది నీ పదములపై కినుక కాదని
బుద్ద బోధలు చేసినా మారని మా బోటి మూఢులని
అశ్వరూఢుని కత్తికి బలి కాకుండా చూడాలని
ధర్మపథంలో మము నడిపే శరణాగతులుగా
ఆ పాదాలను కొండపై స్థిరనివాసులుగ చేశావని
వాటికి బాధలు లేకుండా అండవై నీవే చిద్విలాసుడిగ నిలిచావని
గోవిందా నీకు దయ అంతుందా!
గోవిందా నీ దయకు అంతుందా!!


Leave a Reply