నిజం చెప్పు కిట్టయ్యా, గీత నువ్వు పలికావా
యశోదమ్మను అవాక్కు చేసిన
మన్ను తిన్న నోటితో, ఆ దివ్య వాక్కుని పలికావా
కొండలపట్టి గోవుల కాచే గోపాలకుడా గీతాలాపకుడు
తులాభారం తూస్తే తులసిదళమెత్తు తూగని నువ్వు
వేదాంతం కాచి వడపోస్తే కానీ తేలని గీతని పలికావా
ముద్దుగుమ్మల నుంచి బుగ్గముద్దో, వెన్నముద్దో దోచి
వేణుగానంలో వారిని తడిపి ముద్ద ముద్ద చేసే నువ్వు
సిద్దులని సైతం మంత్రముగ్ధులని చేసే గీతని పలికావా
ఆయుధం కాక పిరికి వలే పగ్గాలు పట్టిన వాడవు
వీరాధివీరునికే మనో ధైర్యం నింపే ఆత్మఙ్ఞానగీతని
నిజం చెప్పు కిట్టయ్యా నువ్వే పలికావా
పాలసంద్రమే పడకటిల్లయన వాడు పలికాడంటే నమ్ముతా
ఇరుగు పొరుగుల పాలు పెరుగుల దోచేవాడు గీత పలికేనా
ఏదీ మళ్ళీ ఒకసారి చెప్పు నాకు వినబడేట్టు
అలాగైనా ఇంకోసారి ఈ నేలపై నీ అడుగెట్టు


Leave a Reply