కస్తూరీ తిలకం నీ నుదుట ఉంటేనే కృష్ణుడివా
ఎంత సొగసుగా అది దిద్దుకొచ్చినా
నా ఒక్క ముద్దుతో అది చెరిగిపోదా
ఆ చెంగల్వ పూదండల సువాసనలు
ఆ సర్వాంగ హరిచందన సౌరభాలు
ఎంత సొంపుగా అవి అద్దుకొచ్చినా
పరిష్వంగన ఝరుల ఆవిరై కలిసిపోవా
ఆ కౌస్తుభం, ఆ మౌక్తికం, ఆ ముక్తావళులు
ఆ బంగారు మొలతాళ్ళూ రాళ్ళే నీ ఆనవాళ్ళా
రాసక్రీడా వినోద వేళ అవి కఠినమై నను గుచ్చుకోవా
ఆ ఊదే వేణువు వినిపించే పిలుపులూ
ఆ కర కంకణ ఝణఝణ మ్రోతలూ
ఆ సిరిమువ్వగజ్జెలూ అవేనా నువ్వంటే
అవి కావాలా తోడుగా నువ్వుంటే
ఇలా అంటూ కృష్ణుడిపైనుంచి ఒక్కొక్కటి ఒలిచేసి
శృంగార రసరమ్య లీలలో ఓ గోపాంగన మునిగేసి
బిత్తర పోయిందట తన ముందర ఏముందో చూసి
కనిపించాడట పరమాత్మ నిజరూప దర్శనమిస్తూ
నిరాకార సచ్చిదానందమై ఎదురుగా చిందులేస్తూ
మాయలు తొలగి చూస్తే కనిపించేది దైవమే
ఆ నందగోపాలుడంటే బ్రహ్మానంద సంద్రమే
ఇంతటి ఆనందమూర్తివి ఇన్నాళ్ళూ దాగున్నావేం
ఆనందపు అనుభూతి అనునిత్యం కలిగించలేదేం
ఎదలో మెదిలే ప్రశ్నని అడిగింది పరంధాముని
నవ్వుతూ బదులిచ్చాడు ఙ్ఞానం ఉపదేశిద్దామని
కనులు మూసుకు వెతికితే దీపమెలా కనిపిస్తుందీ
సంతోషపు అన్వేషణలో ఆనందమెలా సిద్దిస్తుందీ

Leave a Reply