ఓ గణనాధా, ఈసారైనా పండక్కి కైలాసంలోనే ఉండిపోరాదా
ఎపుడూ భూలోక భక్తులతోటేనా, ఈమారైనా కొండెక్కి అక్కడే జరుపుకోరాదా
నలుగు పిండితో పుట్టించిన అమ్మ
నలుగులు నీకు పట్టించాలనో, పిండివంటలు వడ్డించాలనో
చూస్తోందేమో తెలుసుకోరాదా
ఆ అమ్మకూ కాస్త తృప్తి కలిగించరాదా
మా క్షేమం కోరి మేం పూజించే ఆకు స్నానాలపై నీకెందుకీ మక్కువ
నీ క్షేమం కోసం తల్లి అపర్ణ చేయించే మంగళ స్నానాల కేం తక్కువ
మా ఉండ్రాళ్ళూ జిల్లేళ్ళకై ఎందుకు తిరుగుతావు భూమి చుట్టూ గిరగిరా
గిరిపై గంగాధరుడు నిను భుజముల నెత్తగ, గౌరి తినిపించే గోరు ముద్దలు నీకు వగరా
ఎపుడూ వేడుకునే మా ఆకళ్ళని మరెప్పుడైనా ఆదుకోవచ్చు గానీ
నీ ఆటే వేడుకైన ముక్కంటి కళ్ళకి విందుగా, పుట్టిన నాడైనా ఆడుకోరాదా స్వామీ
ఏమిటయ్యా, శివ పార్వతుల దగ్గర జరుపుకొమ్మని ఇంత చెప్పినా ఇటు వచ్చేసావ్!
ఏంటీ? ఆ జంటే నీ కన్నా ముందుగా ఇటు వచ్చేసిందా!!
అవునులే శివయ్యకి నువ్వెంతో మేమూ అంతేగా
నా పిచ్చి కానీ, శక్తిమాత ఉండేది సదా మా చెంతేగా
సరే ఎలాగూ వచ్చావ్, మా నైవేద్యం పుచ్చుకో
నిమజ్జనం ఎటూ చేస్తాం, ఆ వేడుకా చూసిపో
షరామామూలేగా, నీ దీవెన నిర్విఘ్నంగా ఇచ్చిపో

Leave a Reply