దసరా పండగలకి నా ఇంటికి రావమ్మా
నిజానికి ఇది నీ ఇల్లే, పదిరోజులూ ఉండిపోవమ్మా
బొట్టెట్టి పిలిచాను జగన్మాతను
బెట్టుపోతూ వచ్చింది ఏంచెప్పను
నన్ను పరీక్షించాలని కాబోలు రోజుకో రూపం
రూపు మారితే పోల్చుకోలేననుకుందేమో పాపం
ఎన్ని రూపాల్లో వచ్చినా అదే మందహాసం
చెప్పకనే చెబుతోంది అమ్మ చిద్విలాసం
చేయి పట్టి ఓనమాలు దిద్దించి
నాల్క అంచున నిల్చి విద్దెలెన్నో పలికించి
చదువులు నేర్పిన గురువులందరిలో కనిపించి
సుపరిచితమైన ఆ దివ్య తేజం పోల్చలేనా
స్పష్టంగా కనిపిస్తూంటే వీణ పట్టినా, శ్వేతవస్త్రం కట్టినా
గోరుముద్దలు తినిపించిన నాటి నుంచి
నా బొజ్జకు ఒజ్జై నా పళ్ళెంలో పూర్ణమై నిలిచి
అన్నప్రదాతయైన చిదానందరూపాన్ని మరిచేనా
అన్నపూర్ణమ్మ పేరు మాటున దాగితే పోల్చలేనా
కాళరాత్రుల చీకట్లలో ఒంటరి నడకలు సాగిస్తూంటే
ధైర్య రసాలు నాలో నూరిపోస్తూ ముందుకి నను తోస్తూ
నా వెన్నంటే నిలిచిన చిదానంద రూప నైజం
ఇట్టే పట్టేశా రౌద్ర భద్రకాళి వెనుక దాగిన వైనం
చిన్ని చిన్ని పందాల్లో, బ్రతుకు పోరాటాల్లో
పడుతూ లేస్తూ సాగే వేళల
భుజం చరిచీ, వెన్ను తట్టీ చేయి పట్టీ
గెలిపించిన ఆ విజయ స్పర్శ
కొత్తగా లేదులే దుర్గమ్మగా వచ్చినా నే పోల్చేశా
పైరుల్లో, పూలల్లో, సెలయేటి నీళ్ళల్లో, బాల నవ్వుల్లో
లలిత పద కవితల్లో, ఓంకారంలో
కనకధారా స్తోత్ర మహిమల్లో సలక్షణంగా లక్ష్మీమయంగా
అన్నివేళల్లో అన్ని రూపాల్లో నిండి ఉన్న తల్లి ఉనికి
పట్టలేనా రాజేశ్వరైనా, ఐనా ఈ మాయ దేనికి
పోనీలే ఈ దాగుడుమూతల ఆటా బాగానే ఉంది
బిడ్డని మురిపించే తల్లి తపన ఇందులోనూ కనిపిస్తోంది

Leave a Reply