పొద్దునే శ్రీకృష్ణుడు నిదురలేచాడు
పూలతోట కేసి వడివడిగా అడుగేశాడు
పూలుకోసి దండ చేసి
రాధ సిగలో చెండు తురిమి
ఆ సిగను తాకి మురిసే రాధను
మురిసిపోతూ చూడడానికి
పొద్దునే శ్రీకృష్ణుడు నిదురలేచాడు
పూలతోట కేసి వడివడిగా అడుగేశాడు
పొద్దుకంటే మునుపే రాధమ్మ లేచింది
స్వామికంటే ముందే పూదోట చేరింది
పూలుకోసి మాల చేసి
ప్రభుని మెడలో దండవేసి
అందగాడై మెరిసే కృష్ణుని
మురిసిపోతూ చూడడానికి
పొద్దుకంటే మునుపే రాధమ్మ లేచింది
స్వామికంటే ముందే పూదోట చేరింది
తోట చేరి చూశాడు పూలు లేని బోసి మొక్కల కేసి
స్వాగతం పలికింది రాధ మెడలో పూలమాల వేసి
వెలిగిపోతున్న మాలాలంకృతుడిని చూసి
రాధ పరవశించి మురిసిపోయింది
రాధ కనుల వెలుగు చూసి
మాధవుడు పరవశించి మురిసిపోయాడు
కృష్ణుడు చెండు కూర్చి తన సిగలో తురిమినా
తానే దండ పేర్చి కృష్ణుడి మెడలో వేసినా
రాధకు రెండూ మురిపించే ఆనందమే
రాధ ఎలా మురిసినా స్వామికి ప్రమోదమే
ఇంతకీ ఎవరి ఆనందం ఎక్కువో
అని తోట మొక్కల కొచ్చింది సందేహం
అసలు భాగ్యం మాదెలెమ్మంటూ
మాలలో చేరిన పూల సమాధానం
రాధ చేతుల సుతారంగా అల్లబడడం
సామి మెడలో విలాసంగా దండై నిలబడడం
నిజభాగ్యం ఇదేలెమ్మంటూ దండ పులకరించింది
నిజమేసుమీ అంటూ సుమవనం తల పంకించింది


Leave a Reply