ఆ క్రూర కంసుడి పిలుపందుకొని
అక్రూరుని రథమెక్కి వెళతావెందుకని
బృందావనమంతా ఘొల్లుమని రోదిస్తుంటే…
కన్నయ్యా మము వీడద్దని దారికడ్డి వారిస్తుంటే..
తనకేమీ పట్టనట్టు చూస్తూ నిలబడి పోయిందేం రాధ
ఆగు కృష్ణా వెళ్ళద్దని మాటవరసకైనా తానూ అనరాదా
ఆలోచిస్తూ అడుగేస్తున్నాడు రాధికా మనో ప్రేమికుడు
తనని తానే అడిగేస్తున్నాడు అన్నీ తెలిసిన ఆ ప్రేక్షకుడు
సులువు కాదు రాధమ్మకు ఇక సెలవని చెప్పడం
తెలిసీ తెలిసీ మళ్ళీ వస్తానని మాటిచ్చి ఎలా తప్పడం
నీవు లేక నేనెలా అని తానంటే వలవలా ఏడుస్తూ
నాకూ అంతేలే అనచ్చు ఊరడిస్తూ కన్నీరు తుడుస్తూ
పోతేపో నాకేంటీ అన్నా బాగుండేది
పొమ్మన్నావుగా పోతున్నా అనే వీలుండేది
ఎన్నాళ్ళకి తిరిగొస్తావనో, వస్తూ నాకేం తెస్తావనో
నోరువిప్పో, కళ్ళుతిప్పో ప్రశ్నిస్తే నిలదీసి
బదులివ్వచ్చు చుబుకం పట్టో, కన్నుగీటో మాయచేసి
నీతో నేనూ వస్తాననో, క్షణమాగు ఎదురొస్తాననో
అంటూ కాస్త దగ్గరకొస్తే ఎంత బావుణ్ణు
ఎంచక్కా గారమో మారామో చేసే వీలుణ్ణు
మథురలో భధ్రం సుమా అని మధురంగా అనచ్చు
ఏదైనా కానుకిచ్చి నా గుర్తుగా ఉంచమనచ్చు
తలూపి నేనూ అబ్బా ఎంత ప్రేమ అని మురిపించచ్చు
నను మించినవారు నీకక్కడ తగలరని
తనలా మురిపించువారు నాకెక్కడా దక్కరని
బింకాలు పలకదేం మూతి వంకర్లు తిప్పదేం
ఒక్కసారి నవ్వమనో కలిసి ఊయల ఊగమనో
కడసారిగా వేణువూదమనో వాదులాడమనో
బ్రతిమాలి అడగదేం కనీసం బలవంత పెట్టదేం
అవునులే అలా చేస్తే తాను రాధెందుకవుతుంది
నా మనసుకి అద్దం అర్ధం తానెందుకవుతుంది


Leave a Reply