రేపల్లె వీధుల తిరుగుతోంది నీలమోహనుని రథం ఆ దృశ్యం కనులజూడ తెలియు ఆ పల్లె మనోరథం నీలాల మబ్బులా రథంపై నిలిచాడు లీలాకృష్ణుడు ఊరేగుతూ మురిపెంగా చూసే గోపకాంతలకు పలకరింపుగా చేయూపుతూ సరసంగా చేయిచాచే భామలకు చేయందించి సరసకు చేరుస్తూ వేణువూదుతూ, విలాసంగా చిరునగవులు చిందిస్తూ రేపల్లె వీధుల తిరుగుతోంది నీలమోహనుని రథం ఆ దృశ్యం కనులజూడ తెలియు ఆ పల్లె మనోరథం వడివడిగా సాగే ఆ గుర్రపు డెక్కల సవ్వడి వినిపిస్తోంది వీనులవిందుగా నారదముని సంకీర్తనల కరతల చిడతల నాదంగా దివి నుండి దేవతలు చేసే కరతాళ ద్వనుల ప్రమోదంగా రేపల్లె వీధుల తిరుగుతోంది నీలమోహనుని రథం ఆ దృశ్యం కనులజూడ తెలియు ఆ పల్లె మనోరథం రథం వెంట పరుగులిడే గోపబాలుర హడావుడి చూడాలి గుర్రం తోటి పోటీ కాదు,వారికి కృష్ణుడు దగ్గరగా కనబడాలి వేడుకగా అలా చెలికాడితో ఆడుకోవడం వారికి పరిపాటి దొరికీ దొరకని దొరకు చేరువగుటలో వారికి వారే సరిసాటి ఆ వీరబాలమూర్తి ఠీవి తీరు తిలకిస్తూ తన పెంపకమెంత బాగుందో అని ఆనందిస్తూ గర్వంగా మీసం మెలివేస్తున్నాడు ఆ నందుడయ్య సాగే లీలని గమనిస్తూ, తల పంకిస్తూ బండి ఇరుసే పాంచజన్యశంఖంగా రథచక్రం సుదర్శనంగా, ఆదిశేషుడే పగ్గాలుగా, ఆ రథమే గరుడునిగా దర్శిస్తూ మురుస్తున్నాడు అన్నీ తెలిసిన అన్న బలదేవుడు హొయలొలుకుతూ పరవశిస్తోంది సరసకు చేరిన పిల్లభామ తన వంతు కోసం ఎదురుచూస్తోంది ఓర్పుగల ఓ గొల్లభామ తనకు చోటుచిక్కదేమో అని గునుస్తోంది చక్కని పల్లెభామ నోట బ్రహ్మాండం చూపించినా లీలాధరుడు తల్లికెప్పుడూ మురిపాల బాలుడే అందుకే జరిగే తంతుని గాబరాగా బిక్కుబిక్కుమని చూస్తోంది అమ్మ యశోద ఆ గుంతల కుదుపు ఆ మేను తట్టుకోదేమో ఆగంతకుల దిష్టి బిడ్డడికి తాకుతుందేమో నాకన్న కందిపోతాడని తల్లి యశోదమ్మ దైన్యం దూరంగా దాగుండి చోద్యం చూస్తోంది రాధ ఆ రథమేదారిపోతున్నా తుదకు చేరేది నా దరికే ఏ అంగన కొంగున చేరినా అది ఏదో కొంత వరకే ఎందరు పందెము దిగినా గోవిందుడి డెందము నాదే నాకందక పోడులెమ్మని రాధమ్మ ధైర్యం నాకన్న కందిపోతాడని తల్లి యశోదమ్మ దైన్యం నాకందక పోడులెమ్మని ప్రియసఖిరాధమ్మ ధైర్యం ఇలా రేపల్లెవాసులందరికీ ఒక్కో పులకింత అసలేమనిపిస్తోందో వాసుదేవునికి ఈ వింత చూసుకున్నవారికి చూసుకున్నంత చేసుకున్నవారికి చేసుకున్నంత అయ్యవారికి ఈ యాత్రలేం ఎక్కువా? మక్కువా? రథమెక్కి ఊరేగడం అది జనం కనులవిందుకే అనుదినం ఈ వీధుల వ్యాహ్యాళి చేసేది అందుకే ఏ సుధాముడో ఎదురైతే క్రిందికి దూకేస్తాడు గబుక్కున మొరలాలింపగ తరలివచ్చి చేర్చుకుంటాడు అక్కున
+1
+1
+1
+1


Leave a Reply