ఆ మంజీరములు తాకి నీ పదములు కందునేమో
ఈ అల్లిన మల్లియల పట్టి కాలికి తొడగ నీవె
ఆ వడ్డాణపు బరువు నీ నడుము ఓపదేమో
ఈ విరజాజుల మాల మొలనూలుగ చుట్టనీవె
పాషాణమై గుచ్చెడి ఆ మణి హారాల బదులు
పారిజాత పూదండ సున్నితమై మెడ నుండనీవె
కోమలాంగి రాధ మృదు దేహమెల్ల
మెల్లమెల్లగ కుసుమ శోభల దిద్దిదిద్ది
నందగోపాలుడీలీల రసలీల సాగించె ఆనందహేళ
ఇంతలో రానేవచ్చె ఎడబాటు తప్పని వేళ
విడలేక విడలేక వదలి వెడలెడి జంటను
విడనీక కలిపి వేసెడి భారము తనపైని వేసికొని
సఖి కురులను పెనవేసి చిక్కుముడివేసె కరకంకణం
కౌస్తుభంలో మెరిసి దృశ్యమై చిక్కె ఆ తరుణం
ప్రేమికులనటు బంధింప ఆ కౌస్తుభమెంత గడసరో
స్వామి ఆభరణములగుటకై ఆ రాళ్ళేతపము చేసిరో
+1
+1
+1
+1

Leave a Reply