నువ్వో పిచ్చిమాలోకం
ఎంత పిచ్చికాకపోతే పండగపూటా పస్తులేంటి
దేవుడంటే ఎంచక్కా నైవేద్యాలడగాలి
నీకిదెక్కడి ఊహరా, హరా
భిక్షాటనలే నీకు కలిగిస్తాయి తృప్తి
భక్ష్యాలకు లేదు పండగనాడైనా ప్రాప్తి
నువ్వు తినవు, మమ్మల్ని తిననీయవు
దేవుడంటే హాయిగా పాన్పుపై శయనించాలి
నాకో శంక రా, శంకరా
నీ కాపు లేకుంటే నిలువవా ముల్లోకాలు ఏ నిమిషమూ
మూడు కళ్ళేసుకుని కాస్తూంటావు గస్తీ అహర్నిషమూ
నువు పడుకోవెప్పుడూ, మము పడుకోనీయవు నీ పండగప్పుడు
దేవుడంటే బేషుగ్గా సోగ్గా చీనాంబరాలు తొడగాలి
నిను ఒప్పించడం మా వశంభో, శంభో
నువ్వో దిగంబరుడివి
నీ రహస్యం అంతు తెలియని చిదంబరుడివి
పీతాంబరాలు నీకుండవు, సంబరానికి కొత్త బట్టలు మాకుండవు
దేవుడంటే నగా నట్రా, సిరులూ గట్రా ఉండాలి
నువ్వొక వింత జీవరాశివయ్యా, శివయ్యా
నాగులు మెడనేసుకు తిరిగే నీకు నగలెందుకు
బూడిద పూసిన ఒంటికి గంధపు పూతెందుకు
నీకు బంగారాలుండవు, నీ వేడుక్కి మాకు సింగారాలుండవు
దేవుడంటే ఎన్నో నోములూ పూజలు తపస్సులకే లొంగాలి
నీదో ఒట్టి లింగం గాధరా, గంగాధరా
నీళ్ళు కుమ్మరిస్తే మురిసిపోతావు
పరవశించి భక్తికి వశించిపోతావు
నీకు భోగాల యావ లేదు, మాకు శ్రమించే యోగం లేదు
ఇందుకే మళ్ళీ అంటున్నా నువ్వో పిచ్చిమాలోకం
అందుకే సదా ధ్యానిస్తాం నిను రప్పిచ్చి మా లోకం

Leave a Reply to Anonymous Cancel reply