హరిదాసు నారదముని
పరంధాముని స్తుతియిస్తూ
వినువీధుల విహరిస్తూంటే
అది వీనులవిందుగ వినిపిస్తూంటే
శయ్య దిగి లేచాడు భుజగశయనుడు
తన దారిన కదిలాడు సంక్రాంతి పురుషుడు
————————-
అంతకు మునుపే లేచి
పాలసంద్రమంతా కడిగించి
పాలపుంతల కళ్ళాపు చల్లించి
చుక్కలే ముగ్గుచుక్కలుగా కూర్చి
రంగుల రంగవల్లుల దిద్దింది శ్రీరంగవల్లి
గొబ్బిగ శశి బింభమె నిలిపింది ఆ మహాతల్లి
——————————–
శంభు కంఠ నొకటి జలరాశి నొకటి
మరియు నొకటి మనుజ మందిరముల
వెచ్చటి ముచ్చట నిచ్చెటి మూడగ్నుల రాజిల్లజేసి
యోగిభిధ్యానగమ్యుడు భోగిమంటలు వేసె
——————————
మకరి కరిచిన కరి మొర విని
కనికరించిన మురహరి పురిని
మకర సంక్రమణ వేడుక జరుగునని
పలకరించగ కైలాస శిఖరి విడి చనియె
నంది బసవయ్య తో చిదానంది శివయ్య
—————————–
భోగిపళ్ళ పేరంటానికి వచ్చారంటా
సురేశునింటికి సురసతులు సుతలు
అక్కడ ఉన్నాడు విశ్వాధారుడు నెలవై
అతడే అనిపించాడట ఏడేడు భువనాల బొమ్మల కొలువై
————————————
భోగిపళ్ళకై బ్రహ్మయ్యను పిలిచాడట పద్మనాభుడు
భూలోకవాసుల గాలిపటాలు చూచి
విరించి చేశాడట తండ్రితో పేచీ
వేదాలు వల్లించే తన బొడ్డడు తన బిడ్డడు
వాదిస్తూ రోదిస్తూ వేధిస్తూంటే
శాంతంగా వారిస్తూ భోధించాడట శాంతాకారుడు…
“పతంగీ పైకి ఎగరాలంటే మనకంటే పైన ఏదైనా ఉండాలిరా కన్నా
మనదే సర్వోన్నత స్థానం ఆ పై ఏముంది అంతకన్నా”

Leave a Reply to Raja Gopal Cancel reply